 Movie:  చమ్మక్ చల్లో (2.25/5)
         Movie:  చమ్మక్ చల్లో (2.25/5)Release date: 15 Feb, 2013
Cast: వరుణ్ సందేశ్, సంచితా పడుకునే, కేథరిన్ ట్రెస, షాయాజీ షిండే
Director: జి.నీలకంఠ
Producer: డి.ఎస్.రావు
Music Director: కిరణ్ వారణాసి
Banner: శ్రీ శైలేంద్ర సినిమాస్
అనగనగా ఓ దర్శకుడు. స్క్రీన్ ప్లే 
అల్లుకోవడంలో ఆయన దిట్ట. చిన్న కథ దొరికినా దానికి ఆసక్తికరమైన కథనాన్ని 
జోడించి ప్రేక్షకుల్ని రక్తి కట్టిస్తాడు. ఇప్పటిదాకా ఆయన తీసిన 
సినిమాలన్నీ ఆ రకంగానే అలరించాయి. అయితే ఆయన చేసిన సినిమాలకు అవార్డులు 
ఎక్కువగా వచ్చాయి కానీ రివార్డులు మాత్రం రాలేదు. దీంతో ఎలాగైనా ఓ ప్రేమకథ 
తీయాలనుకున్నాడు. ఆ కథతో యూత్ ని ఆకట్టుకుంటే చాలు. కాసుల వర్షం 
కురుస్తుంది, తద్వారా కమర్షియల్ దర్శకుడిగానూ పేరు తెచ్చుకోవచ్చని 
తలచినట్టున్నాడు. 
ఓ.... ప్రేమకథ. అది ఎలా ఉండాలి? పైగా 
స్క్రీన్ ప్లే లో దిట్ట అని పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమకథ 
తీస్తున్నాడంటే ఎంతైనా కొంచెం ఎక్కువగానే ఆశిస్తారు కదా. అందుకే కాస్త 
కొత్తగా ఉండాలనుకున్నాడు. ఆ కొత్తదనం కోసం 1940 నుంచి వచ్చిన ప్రేమకథలన్నే 
వరసపెట్టి చూసేసాడు. ఏమీ పాలుపోలేదు. పాపం టచ్ చేయని యాంగిలే కనబడలేదు. 
అలాంటప్పుడు అతను మాత్రం ఏమ్చేస్తాడు. అందుకే ఏదో ఒకటి తీసేద్దాం 
అనుకున్నాడు.  విచిత్రంగా ఈసారి ఆయనలో ఉన్న స్క్రీన్ ప్లే మంత్రం కూడా 
పనిచేయకుండా పోయింది. చివరికి రుచి, పచి లేని ఓ సాదా సీదా ప్రేమకథ 
బయటికొచ్చింది. ఇంతకీ ఆయన ఎంచుకొన్న ఆ కథేమిటో ఓసారి చూద్దాం. 
కథ:
అమెరికాలో ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ 
కిరణ్(అవసరాల శ్రీనివాస్).  సినిమా తీయాలనే కోరికతో ఇండియా వస్తాడు. అక్కడ 
సాఫ్ట్ వేర్ బూమ్ పడిపోయిందని చెప్పి ఆయన ఈ నిర్ణయం తీసుకోలేదు. స్వతహాగా 
మనోడికి సినిమా అభిరుచి ఎక్కువ. అందుకే ఓ కథ రాసుకొని తెలుగు సినిమా 
నిర్మాతను కలుస్తాడు. నీ కథకు అవార్డులు మాత్రమే వస్తాయి. రివార్డులు రావు,
 అందుకే ఓ ప్రేమకథ రాసుకొమ్మని సలహా ఇస్తాడు ఆ నిర్మాత. తన సినిమాకి 
పనికొచ్చే ఓ మంచి ప్రేమకధ కోసం అన్వేషిస్తూ వుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే 
 అప్పారావు అగర్వాల్(షాయాజీ షిండే) అనే ఓ లెక్చరర్ పరిచయం అవుతాడు. తన 
స్టూడెంట్స్ ఇద్దరి మధ్య సాగిన ఓ  ప్రేమ కథ చెబుతాడు. శ్యాం(వరుణ్ సందేశ్),
 అన్షు(సంచితా పడుకునే) ల ప్రేమ కథ అది. ప్రేమంటే ఏమిటో కూడా తెలియని ఆ 
ఇద్దరు... మొదట స్నేహితులవుతారు. ఆ తర్వాత ప్రేమికులవుతారు. ఇంట్లో 
పెద్దవాళ్ళు కూడా వారి ప్రేమకు పచ్చ జండా ఊపేస్తారు. నిశ్చితార్ధం 
జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? పెళ్ళే కదా?... కానీ వారిద్దరూ పెళ్లి 
చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయారు. అందుకు కారణమేమిటో అప్పారావుకి కూడా 
తెలియదు. మరి ఆ కాబోయే దర్శకుడు తన కథకు ఎలాంటి ముగింపు ఇచ్చాడన్నది 
తెరపైనే చూడాలి. 
విశ్లేషణ:
ప్రేమ అప్పుడూ ఇప్పుడూ ఒకటే కావొచ్చు. 
ప్రేమికులు మాత్రం మారిపోయారు. వారి భావోద్వేగాల్లోనూ మార్పులొచ్చాయి. ఆ 
విషయాన్ని గమనించకుండా 90లలో వచ్చిన ప్రేమకథనే అటు ఇటు తిరగేసి... 
ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఎలా? ప్రేమ కాదు, ఆకర్షణ మాత్రమే అని 
తెలుసుకున్నా... తనని తాను కంట్రోల్ చేసుకోలేని ఓ కుర్రాడు, ఎదుటి 
వ్యక్తిలోని అభిప్రాయాల్ని అర్థం చేసుకోకుండా చిన్న విషయానికే పేచీ పడే ఓ 
అమ్మాయి మధ్య సాగే సగటు కథ ఇది. ఇందులో భావోద్వేగాలు కానీ, రొమాన్స్ కానీ ఏ
 మాత్రం కనిపించదు. గమ్మత్తేమిటంటే.. ఇందులో కథానాయకుడు నాయికకి లిప్ టు 
లిప్ ముద్దులు పెట్టినా ప్రేక్షకుడికి ఏ మాత్రం అనుభూతి కలగదు.  
సాంకేతికత:
ఈ సినిమాకి దర్శకుడు నీలకంఠ కదా కనీసం 
చివరిలోనైన ఏదో ఒక ట్విస్ట్ ఉంటుందని ప్రేక్షకుడు ఊహిస్తూ సీట్ కి బలవంతంగా
 అతుక్కుపోయినా ఏ మాత్రం లాభం కనిపించదు. అదే కథను, అంతే సాదా సీదాగా 
క్లైమాక్స్ కి చేర్చి సినిమా అయిందనిపించాడు. కథానాయిక చివరలో సైకోగా 
మారిందా అనే సందేహం కలుగుతుంది. కానీ ఆ వెంటనే ఓ నవ్వు నవ్వించేసి శుభం 
కార్డు వేసేసాడు. ఇక నటీనటుల విషయానికొస్తే వరుణ్ సందేశ్ మరీ బక్క పలచగా 
కనిపిస్తాడు. సునయన అనే పాత్రలో కేథరిన్ చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని 
కనిపింస్తుంది. సంచిత ఏదైనా టూత్ పేస్టు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా 
పనిచేసిందేమో.. ప్రతి సన్నివేశంలోనూ నవ్వుతూ కనిపిస్తుంది. అయితే ఆ నవ్వు 
కూడా బలవంతంగా నవ్వినట్టు అనిపిస్తుంది. పాటలు సాదా సీదాగానే ఉన్నాయి. 
చాయాగ్రహణం విషయంలో చాలా చోట్ల లోటుపాట్లు కనిపిస్తాయి. బహుశా అది బడ్జెట్ 
ప్రాబ్లం అయ్యుండొచ్చు. 
చివరగా...
నీలకంఠ లాంటి దర్శకుడి నుంచి ఏ మాత్రం ఊహించలేని కథ ఇది. ఎక్కువ ఆశించి వెళ్తే మాత్రం నిరాశే మిగులుతుంది. 
 
No comments:
Post a Comment